240.. కోరుకున్న ప్రత్యర్థి మన ముందుంచిన టార్గెట్ ఇది. ఓ మోస్తరు లక్ష్యమే! వరుస మ్యాచుల్లో సెంచరీలతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, గత మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన కేఎల్ రాహుల్.. చేజింగ్ హీరోగా ఖ్యాతిగాంచిన కెప్టెన్ కోహ్లీ ఎలాగూ ఉన్నాడు. ఇంకేం.. కివీస్ విసిరిన ఆ లక్ష్యాన్ని ఒక్క టాపార్డరే ఛేదించేస్తుందని సంబరపడ్డ భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఈ ముగ్గురూ ఒక్కో పరుగుకే పరిమితమై బ్యాట్లెత్తేయడంతో మ్యాచ్ సగం చేజారిపోయింది! ఆఖర్లో జడేజా (59 బంతుల్లో 77) అద్భుతంగా పోరాడినా.. అప్పటికే ఆలస్యమైపోయింది!! మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకేకుప్పకూలిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ ప్రస్థానం వరుసగా రెండోసారీ సెమీఫైనల్‌తోనే ఆగిపోయింది. అద్భుతమైన ఆటతీరుతో అలరించిన న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
టోర్నీలో ఐదు సెంచరీలతో రోహిత్ ప్రపంచ రికార్డు.. సమకాలీన క్రికెట్‌లో ఎదురులేని ఆటగాడు విరాట్ కోహ్లీ..చివరి లీగ్ మ్యాచ్‌లో సెంచరీ చేసి నిండైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం.. భీకర షాట్లతో కొద్ది ఓవర్లలో మ్యాచ్ గతిని మార్చివేసే డ్యాషింగ్ హార్దిక్ పాండ్యా, ‘నిఽధహాస్’ ట్రోఫీలో వలే ఆదుకుంటాడనుకున్న దినేశ్ కార్తీక్ స్వల్ప స్కోరుకే పరిమితం.. దాంతో 3/5, 24/4,92/6తో మ్యాచ్‌పై ఆశలొదులుకున్న తరుణంలో మూడు వందలకుపైగా మ్యాచ్‌ల అనుభవం కలిగిన ఎమ్మెస్ ధోనీ, ఆల్‌రౌండర్ జడేజా అసమానం పోరాటం చేశారు..గెలుపు లాంఛనమే అనుకున్న న్యూజిలాండ్‌కు వణుకు పుట్టించారు. భారత్‌ను విజయం అంచుల దాకా చేర్చారు.. కానీ ఒత్తిడిని అదిమి పట్టిన కివీస్ బౌలర్లు, ఫీల్డర్లు కీలక తరుణంలో మరోసారి సత్తా చాటారు.. జడేజా, ధోనీని అవుట్ చేసి భారత్‌ను
దెబ్బకొట్టారు.. ఫైనల్ చేరారు.
మన బౌలర్లు న్యూజిలాండ్ ఓపెనర్లకు మంగళవారం చుక్కలు చూపించిన సమయాన కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ సంయమనం ప్రదర్శించారు. ఇదే కివీస్‌కు, మనకూ మధ్య తేడా.. భారీ షాట్లకు పోకుండా ఓపిగ్గా వేచివుండి ఒకటి, రెండు పరుగులతోనే విలియమ్సన్-టేలర్ ఇన్నింగ్స్ నిర్మించిన తీరు అమోఘం..చివరి ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో వేగంగా వికెట్లు కోల్పోయినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఆఖరి వరకూ వీరిద్దరూ ఆడిన తీరు ప్రశంసనీయం.. కానీ మన జట్టు అందుకు పూర్తి విరుద్ధం.. లక్ష్యం చిన్నదే.. వర్షంతో వికెట్ తేమగా ఉండి బంతి సీమ్‌తోపాటు స్వింగైనా రోహిత్, విరాట్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌కు ఆ బంతులను కాచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఒత్తిడికి చిత్తై, షాట్ల ఎంపికలో తడబడి మనోళ్లు ‘బ్యాట్లె’త్తేశారు.. మొత్తంగా బౌలర్లు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బ్యాట్స్‌మెన్ చేజేతులా వృథా చేసుకున్నారు..
ఫలితంగా ట్రోఫీ పట్టేస్తారనుకొంటే సెమీఫైనల్లోనే నిష్క్రమించారు.. జట్టు చాంపియన్ కావడమే తరువాయి సండేను మరుపురానిదిగా చేసుకొందామనుకున్న అభిమానుల కలలు కల్లలయ్యాయి.
మాంచెస్టర్: అసలాటలో మన ‘టాప్’ బ్యాట్స్‌మెన్ రోహిత్, శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చేతులెత్తేశారు. కానీ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న మిడిల్, టెయిలెండ్ బ్యాట్స్‌మెనే ఆపద్బాంధవులయ్యారు. అపార అనుభవజ్ఞుడైన ధోనీ, ఆల్‌రౌండర్ జడేజా శాయశక్తులా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ కీలక సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించి వారిని అవుట్ చేశారు. దాంతో సెమీఫైనల్లో టీమిండియాకు 18 పరుగులతో ఓటమి తప్పలేదు. వర్షంవల్ల బుధవారం కొనసాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసిం ది. మంగళవారం ఆట
ఆపివేసే సమయానికి 46.1 ఓవర్లలో 211/5తో ఉన్న న్యూజిలాండ్ మిగిలిన 23 బంతుల్లో 28 రన్స్ చేసి మరో మూడు వికెట్లు కోల్పోయింది. రాస్ టేలర్ (90 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 74) కిందటి రోజు తన స్కోరుకు మరో ఏడు పరుగులు జోడించి అవుటయ్యాడు. భువనేశ్వర్ (3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా (59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77), ధోనీ (72 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో అమోఘంగా పోరాడారు. వీరుగాక పంత్ (32), హార్దిక్ పాండ్యా (32) మాత్రమే రాణించారు. మ్యాట్ హెన్రీ (3/37), శాంట్నర్ (2/34), బౌల్ట్ (2/42) భారత్ పనిపట్టారు. హెన్రీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టాపార్డర్ టపటపా..
ఓవర్‌కు 4.8 పరుగుల లక్ష్యం. టీమిండియా బ్యాట్స్‌మెన్ భీకర్ ఫామ్ దృష్ట్యా చూస్తే పెద్దదేమీ కాదు. కాకపోతే మంగళవారం నాటి భారీ వర్షంతో వికెట్ కాస్త తేమగా ఉండి బుధవారం మేఘావృ తమైన పరిస్థితులను కివీస్ పేసర్లు సద్వినియోగం చేసు కున్నారు. రెండో ఓవర్లోనే మ్యాట్ హెన్రీ భారత్‌కు షాకిచ్చాడు. ఆఫ్ స్టంప్ ఆవలిగా వేసిన ఫుల్‌లెంగ్త్ డెలివరీని క్రీజులోనుంచి ఏమా త్రం పాదం కదపకుండా ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. దీంతో బంతి అతడి బ్యాటు అంచును తాకుతూ కీపర్ లాథమ్ చేతిలోకి వెళ్లింది. మరికొద్ది సేపటికే ట్రెంట్ బౌల్ట్ దెబ్బ తీశాడు. లెగ్‌స్టంప్‌పై అతడు వేసిన బంతి స్వింగై మిడిల్‌స్టం్‌పవైపు దూసుకొచ్చింది. ఈ బంతిని అడ్డంగా ఆడిన కోహ్లీ ఎల్బీ అయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంపై సంతృప్తి చెందని విరాట్ రివ్యూ కోరాడు. కానీ బంతి వికెట్ దిశలోనే పడినట్టు తేలడంతో విరాట్ నిష్క్రమించక తప్పలేదు. కోహ్లీ అవుటైన షాక్‌నుంచి తేరుకునేలోపే హెన్రీ మరోసారి విజృంభించాడు. నాలుగో ఓవర్లో ఓ అద్భుతమైన స్వింగర్‌తో కీపర్ క్యాచ్‌తో రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ చక్కటి డిఫెన్స్‌తో కొద్దిసేపు కివీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పంత్ ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆరో ఓవర్లో హెన్రీ బంతిని బౌండరీకి తరలించిన పంత్ ఒత్తిడిని ఒకింత తగ్గించాడు. మరోవైపు 20 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయని కార్తీక్..తొమ్మిదో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్‌తో ఖాతా తెరిచాడు. 10వ ఓవర్లో హెన్రీ బంతిని చూడచక్కటి కవర్ డ్రైవ్‌తో పంత్ బౌండరీకి తరలించాడు. కానీ ఇదే ఓవర్ చివరి బంతికి కార్తీక్‌ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు దిమ్మదిరిగేలా చేశాడు హెన్రీ. తర్వాత పాండ్యా, పంత్ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ భారీషాట్ కొట్టబోయి పంత్ అవుట్ కావ డంతో 47 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సీనియర్ ధోనీ, హార్డ్‌హిట్టర్ హార్దిక్ పాండ్యా. జట్టును గట్టెక్కిస్తారనుకొన్నారు. అయితే 31వ ఓవర్లో పాండ్యాను అవుట్ చేసిన శాంట్నర్ కివీ్‌సకు మరో బ్రేక్ ఇచ్చాడు.
ధోనీ-జడేజా అద్భుత పోరాటం..
హార్దిక్ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 92/6. విజయానికి 20 ఓవర్లలోఇంకా 148 రన్స్ కావాలి. దాంతో ధోనీ, జడేజా ఒకటి, రెండు పరు గులు తీస్తూ అవకాశ మొచ్చినప్పుడు షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించి కివీస్‌లో గుబులు రేపారు. 33వ ఓవర్లో నీషమ్ బౌలింగ్‌లో జడేజా సిక్సర్ కొట్టగా తర్వాతి ఓవర్లో బౌల్ట్ బంతిని బౌండరీకి తరలించిన ధోనీ ఫ్యాన్స్‌లో హుషారు తెచ్చాడు. ఆపై హెన్రీ బౌలింగ్‌లో ఫోర్, శాంట్నర్ బౌలింగ్‌లో అదిరిపోయే సిక్సర్ కొట్టిన జడేజా..ఫెర్గూసన్ బంతిని బౌండ్రీగా మలచడంతో 40 ఓవర్లు ముగిసే సరికి 150/6 స్కోరుతో భారత్ పోటీలోకొచ్చింది. అంటే విజయానికి చివరి 10 ఓవర్లలో 90 రన్స్ చేయాల్సిన పరిస్థితి. ఈ దశలో 41వఓవర్లో సిక్స్ దంచిన జడేజా...42వ ఓవర్లో మరో సిక్స్‌తో దుమ్ము రేపాడు. అనంతరం మరో రెండు రన్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 6,4తో అతడు మరింత రెచ్చిపోయాడు.
మళ్లీ దెబ్బకొట్టిన బౌల్ట్..
ధోనీతో కలిసి జట్టును విజయతీరాలకు పరుగులు పెట్టిస్తున్న వేళ జడేజాను అవుట్ చేసిన బౌల్ట్ భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 48వ ఓవర్‌లో బౌల్ట్ నెమ్మదిగా వేసిన బంతిని సరిగా కొట్టలేకపోయిన జడేజా మిడాఫ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో 116 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ధోనీ రనౌట్‌తో..
ఇక చివరి 12 బంతుల్లో భారత్ విజయానికి 31 రన్స్ కావాలి. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి మహీ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. రెండో బంతికి రన్ తీయలేకపోయిన ధోనీ..మూడో బంతిని షార్ట్‌ఫైన్‌లెగ్‌లోకి కొట్టి సింగిల్‌తో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అయితే స్ట్రయికింగ్ తనే ఉంచుకొనే ఉద్దేశంతో రెండో రన్‌కు వెళ్లగా మార్టిన్ గప్టిల్ విసిరిన అద్భుత త్రో నేరుగా వికెట్లను తాకింది. దాంతో కేవలం అంగుళం దూరంలో ఉన్న ధోనీ రనౌట్ అయ్యాడు. అంతే..మరోసారి స్టేడియంలో పిన్‌డ్రా్‌ప సైలెన్స్. విజయం అందినట్టే అంది చేజారిందని భారత్ అభిమానులు కన్నీరు మున్నీరు. ఆ తర్వాత భువనేశ్వర్ (0), చాహల్ (5) వికెట్లను తీసేందుకు న్యూజిలాండ్‌కు ఎంతోసేపు పట్టలేదు.
కోహ్లీ.. మళ్లీ
వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో కోహ్లీ చెత్త రికార్డు కొనసాగుతోంది. ఇప్పటివరకూ మూడు ప్రపంచకప్‌లు ఆడిన విరాట్ ఒక్కదానిలోనూ పట్టుమని పది పరుగులు చేయలేకపోయాడు. 2011లో పాకిస్థాన్‌పై 9 (21 బంతుల్లో), 2015లో
ఆస్ర్టేలియాపై 1 (13 బంతుల్లో), 2019లో న్యూజిలాండ్‌పై ఒక్కపరుగు (6 బంతుల్లో) చేశాడు.
గప్టిల్.. సూపర్ త్రో!
మార్టిన్ గప్టిల్ ఈ వరల్డ్‌క్‌పలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న బ్యాట్స్‌మన్. అలాంటి అతడు అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను న్యూజిలాండ్‌పక్షం చేయడంతోపాటు తనపై విమర్శలు గుప్పించిన వారినుంచే ప్రశంసలు అందుకున్నాడు. 49వ ఓవర్లో ఫెర్గూసన్ బంతిని షార్ట్‌ఫైన్‌లెగ్‌లోకి కొట్టిన ధోనీ రెండో రన్ కోసం ప్రయత్నించాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ నేరుగా విసిరిన బంతి వికెట్లను గిరాటేసింది. దాంతో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో మేటి అయిన ధోనీ రనౌట్ కాకతప్పలేదు.
టోర్నీ ఆసాంతం చక్కగా ఆడాం. కానీ ఆ 45 నిమిషాలు చెత్తగా ఆడడంతో వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించాం. ఈ పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టం. జడేజా గొప్పగా ఆడాడు. ధోనీ రనౌట్ కాకుండా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. టోర్నీ మొత్తంలో మా షాట్ల ఎంపిక బాగాలేదు. ఆ ఒక్కటి తప్ప టోర్నీలో మా ప్రదర్శన సంతృప్తిగా ఉంది. - విరాట్ కోహ్లీ
రిటైర్మెంట్‌పై ధోనీ ఏమీ చెప్పలేదు
రిటైర్మెంట్ గురించి ధోనీ తమకు ఏమీ చెప్పలేదని విరాట్ వెల్లడించాడు. సెమీఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో.. మహీ ఆటకు గుడ్‌బై చెబుతాడని వస్తున్న వార్తల నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు. ‘తన భవిష్యత్ ప్రణాళిక గురించి అతడు మాకేమీ చెప్పలేదు’ అని తెలిపాడు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: గప్టిల్ (సి) కోహ్లీ (బి) బుమ్రా 1, నికోల్స్ (బి) జడేజా 28, కేన్ విలియమ్సన్ (సి) జడేజా (బి) చాహల్ 67, రాస్ టేలర్ (రనౌట్/జడేజా) 74, నీషమ్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 12, గ్రాండ్‌హోమ్ (సి) ధోనీ (బి) భువనేశ్వర్ 16, లాథమ్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 10, శాంట్నర్ (నాటౌట్) 9, మాట్ హెన్రీ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ 1, ట్రెంట్ బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 50 ఓవర్లలో 239/8; వికెట్ల పతనం: 1-1, 2-69, 3-134, 4-162, 5-200, 6-225, 7-225, 8-232; బౌలింగ్: భువనేశ్వర్ 10-1-43-3, బుమ్రా 10-1-39-1, హార్దిక్ పాండ్యా 10-0-55-1, జడేజా 10-0-34-1, చాహల్ 10-0-63-1.
భారత్: కేఎల్ రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, విరాట్ కోహ్లీ (ఎల్బీ) బౌల్ట్ 1, రిషభ్ పంత్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) శాంట్నర్ 32, దినేశ్ కార్తీక్ (సి) నీషమ్ (బి) హెన్రీ 6, హార్దిక్ పాండ్యా (సి) విలియమ్సన్ (బి) శాంట్నర్ 32, ధోనీ (రనౌట్/గప్టిల్) 50, జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77, భువనేశ్వర్ (బి) ఫెర్గూసన్ 0, చాహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5, బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 49.3 ఓవర్లలో 221 ఆలౌట్; వికెట్ల పతనం: 1-4, 2-5, 3-5, 4-24, 5-71, 6-92, 7-208, 8-216, 9-217, 10-221; బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 10-2-42-2, మాట్ హెన్రీ 10-1-37-3, ఫెర్గూసన్ 10-0-43-1, గ్రాండ్‌హోమ్ 2-0-13-0, నీషమ్ 7.3-0-49-1, శాంట్నర్ 10-2-34-2.