లండన్: బంతి బంతికీ ఉద్వేగం! నరాలు తెగే ఉత్కంఠ! ఇంగ్లండ్ చేతిలోకి వచ్చిన మ్యాచ్.. అంతలోనే న్యూజిలాండ్ వశం! న్యూజిలాండ్‌కు అనుకూలంగా మారిన మ్యాచ్.. అంతలోనే ఇంగ్లండ్ పరం! బాల్ బాల్‌కూ అనిశ్చితి! నువ్వా నేనా అన్నట్లు సమ ఉజ్జీలుగా నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్! సూపర్ ఓవర్ కూడా సూపరో సూపర్ అనిపించింది! ఎన్నాళ్లకెన్నాళ్లకు! 45 ఏళ్ల ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది! నాలుగున్నర దశాబ్దాల వరల్డ్‌కప్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా ఎన్నడూ ట్రోఫీని ముద్దాడని ఇంగ్లండ్ జట్టు ఆశ, ఆ దేశ అభిమాని ఆకాంక్ష తీరిపోయింది. కానీ గెలుపు సంతోషంలో కూడా కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌కు స్టాక్స్ క్షమాపణలు చెప్పాడు.
12 బంతుల్లో 24 పరుగులు రావాల్సిన దశలో కివీస్ అద్భుతంగా పుంజుకుంది. నీషమ్ వేసిన 49వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు సింగిల్స్ తీయగా మూడో బంతికి ప్లంకెట్ (10) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతి బంతిని స్టోక్స్ సిక్సర్‌గా మలచడంతో జోష్ పెరిగింది. కానీ ఆరో బంతికి ఆర్చర్ (0)ను కూడా అవుట్ చేయడంతో సమీకరణం చివరి ఆరు బంతుల్లో 15 పరుగులకు మారింది. ఆఖరి ఓవర్‌లో రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోగా మూడో బంతికి స్టోక్స్ సిక్సర్‌గా మలిచాడు. అయితే నాలుగో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో స్టోక్స్ బ్యాట్‌ను తాకిన బంతి ఓవర్‌త్రోతో బౌండరీకి తరలింది. దీంతో మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్ బ్యాటుకు తాకకపోయి ఉంటే... ఫలితం మరోలా ఉండేదేమో, కప్పు న్యూజిలాండ్‌ను వరించేదేమో అనే ఆలోచన అందరిలోనూ ఇప్పుడు మెదులుతోంది.
మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై స్టోక్స్ కూడా స్పందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అని స్టోక్స్ అన్నాడు . ఇది తాను కావాలని చేసింది కాదని.. బాల్ అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందన్నాడు. ఇందులో తను కావాలని ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. ఇందుకు కేన్‌కు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్టపడిందని స్టోక్స్ తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని తాను భావించడం లేదని స్టోక్స్ అన్నాడు.
No comments:
Post a Comment