- నీళ్లలో టీడీఎస్ స్థాయులు తగ్గించే పరికరం
- ధర 3,500కే.. రూపకర్త నిర్మల్‌వాసి
- మార్కెట్‌లోనైతే రూ.75వేల వరకు ధరలు
నిర్మల్ అగ్రికల్చర్, జూలై 11: తలకు చారెడు నిండుగా షాంపూ పూసుకున్నా నురగరాదు. బట్టలకూ అంతే. డిటర్జంట్‌ను ఎంతగా రుద్దినా మురికి వదలదు. చాలామందికి వాడే నీటితో ఇదో సమస్య! దీనికి మనకు అందుబాటు ధరల్లో ఓ చక్కని పరిష్కారం ఏదైనా లభిస్తే? నిర్మల్ యువకుడు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నించి ఓ పరికరాన్ని తయారు చేశాడు. నిర్మల్ గాజులపేట్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి పది వరకే చదివాడు. ఎలాంటి టెక్నికల్ కోర్సులూ చదువలేదు. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నిర్మల్ జిల్లాలో చాలాప్రాంతాల్లో భూగర్భ జలాల్లో నీటి మందం (టీడీఎస్- టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్) స్థాయి పెరిగిపోతోంది. ఈ నీటి వాడకం కారణంగా పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ తలెత్తకున్నా. వాటర్ ట్యాంకుల్లో తెల్లని పొర ఏర్పడి త్వరగా పాడైపోవడం.. ట్యాంకులకు బిగించిన నల్లాలు త్వరగా పాడైపోవడం..
తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు ఊడిపోవడం.. దంతాలు పసుపు పచ్చ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తాయి. నీళ్లలో టీడీఎస్ లెవల్స్ తగ్గించేందుకు మార్కెట్లో పరికరాలు దొరుకుతున్నాయి. అయితే వాటి ఖరీదు ఎక్కువ. నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.75 వేల దాకా వెచ్చించాల్సి ఉంటుంది. స్థోమత లేక చాలా మంది ఈ పరికరాలు కొనేందుకు జంకుతున్నారు. ఈ పరికరాన్ని కొన్న శ్రీనివాస్ రెడ్డి దాన్ని లోతుగా పరిశీలించాడు. దానికి ప్రత్యామ్నాయంగా రూ. 3500 వ్యయంతో మరో పరికరాన్ని తయారు చేశాడు. నిర్మల్‌లో ఇప్పుడు చాలా మంది శ్రీనివాస్ రెడ్డితో ఈ పరికరాలను తయారు చేయించుకొని ట్యాంకులకు అమర్చుకుంటున్నారు.
బాల్స్ కోయంబత్తూరు నుంచి..
కొందరు వేలకు వేలు వెచ్చిస్తూ నీటి మందాన్ని తగ్గించే పరికరాన్ని కొంటున్నారు. అంతంత ధరను సామాన్య ప్రజలు భరించలేరు. అదే తరహా పరికరాన్ని రూ. 3500 ఖర్చుతో తయారు చేసి చాలా మందికి ఇచ్చాను. అందులో బిగించిన బాల్స్ కోయంబత్తూరు నుంచి తెప్పించాను. ప్రస్తుతం ఆ పరికరం నీటి మందాన్ని తగ్గించి ఫలితాలను ఇస్తోంది.
No comments:
Post a Comment