ఉత్కంఠ పోరులో విశ్వవిజేతగా ఇంగ్లండ్
మ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగి..
ఇరుజట్ల స్కోర్లు సమమై..మ్యాచ్ టై అయి..
సూపర్ ఓవర్ దాకా సాగిపోయి..
ఆ సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమై టై కావడం..
అది కూడా ప్రపంచకప్ ఫైనల్లో!!
ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించామా?
అదే అద్భుతం జరిగింది!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ప్రపంచ క్రికెట్ అభిమానులనే మునివేళ్లమీద నిలబెడుతూ.. టై మీద టైకి దారితీసి 2019 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ వరల్డ్‌కప్ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచింది!!
ఆ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలిచింది.
- మ్యాచ్ టై.. సూపర్ ఓవర్ కూడా టై
- బౌండరీల ఆధారంగా విజేత నిర్ణయం
- క్రికెట్ పుట్టింటికి తొలిసారిగా ట్రోఫీ
- కివీస్‌కు వరుసగా రెండోసారీ నిరాశే
- ఆతిథ్యమిచ్చిన దేశానికే మూడోసారి కప్
సూపర్ ఓవర్ సాగిందిలా!
ఇంగ్లండ్ బ్యాటింగ్
క్రీజులో స్టోక్స్.. మరో ఎండ్‌లో బట్లర్ బంతి బౌల్ట్ చేతుల్లో..
- తొలి బంతి: స్టోక్స్ షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా కొట్టాడు. మూడు రన్స్
- రెండో బంతి: బట్లర్.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ వచ్చింది.
- మూడో బంతి: స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ బాదాడు.
- నాలుగో బంతి: ఫుల్‌టాస్‌ను కవర్ దిశగా స్టోక్స్ కొట్టాడు. ఒక్క రన్
- ఐదో బంతి: బట్లర్ డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా కొట్టాడు. 2 రన్స్
- ఆరో బంతి: మరోఫుల్‌టాస్. బట్లర్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా మరో ఫోర్
ఇంగ్లండ్ స్కోరు 15
కివీస్ ఛేజింగ్.. లక్ష్యం 16
క్రీజులో నీషమ్.. మరో ఎండ్‌లో గప్టిల్ ఆర్చర్ చేతుల్లో బంతి
- తొలిబంతి: వైడ్.
- తొలిబంతి: రెండు పరుగులొచ్చాయి.
- రెండోబంతి: నీషమ్ సిక్సర్
- మూడోబంతి: రెండు పరుగులు వచ్చాయి.
- నాలుగోబంతి: మళ్లీ రెండు పరుగులే.
- ఐదో బంతి: ఒక్క పరుగే.
- చివరి బంతి: విజయానికి కావాల్సిన పరుగులు రెండు. ఒక్క పరుగే వచ్చింది. రెండో పరుగు తీస్తూ గప్టిల్ రనౌట్. న్యూజిలాండ్ స్కోరు కూడా 15 రన్స్
ఫలితం.. సూపర్ ఓవర్ కూడా టై బౌండరీల ఆధారంగా విజేత ఇంగ్లండ్
బంతి బంతికీ ఉద్వేగం! నరాలు తెగే ఉత్కంఠ! ఇంగ్లండ్ చేతిలోకి వచ్చిన మ్యాచ్.. అంతలోనే న్యూజిలాండ్ వశం! న్యూజిలాండ్‌కు అనుకూలంగా మారిన మ్యాచ్.. అంతలోనే ఇంగ్లండ్ పరం! బాల్ బాల్‌కూ అనిశ్చితి! నువ్వా నేనా అన్నట్లు సమ ఉజ్జీలుగా నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్! సూపర్ ఓవర్ కూడా సూపరో సూపర్ అనిపించింది! ఎన్నాళ్లకెన్నాళ్లకు! 45 ఏళ్ల ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది! ఆ జట్టు చిరకాల స్వప్నం నెరవేరింది! నాలుగున్నర దశాబ్దాల వరల్డ్‌కప్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా ఎన్నడూ ట్రోఫీని ముద్దాడని ఇంగ్లండ్ జట్టు ఆశ, ఆ దేశ అభిమాని ఆకాంక్ష తీరిపోయింది. ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పుట్టింటికి చేరింది. తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలని భావించిన న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. వరుసగా రెండోసారి రన్నర్‌పగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విజయానికి చేరువై ఓడిపోవడంతో ఆ దేశ అభిమానుల గుండె పగిలింది. ఇంగ్లండ్ విజయానికి ఆఖరు 3 బంతుల్లో 9 పరుగులు అవసరమైన స్థితిలో గప్టిల్ ఓవర్ త్రో.. ఫలితంగా 2 పరుగులు రావాల్సిన చోట ఆరు పరుగులు రావడం ఆ జట్టు ఆవకాశలను దెబ్బతీసింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఈసారీ వన్‌సైడ్ మ్యాచ్ తప్పదేమో! 242 పరుగుల లక్ష్యమే కదా? ఇంగ్లండ్ ముందు అదో లెక్కా? ఊదిపారేయదూ! న్యూజిలాండ్‌కు టైటిల్‌కు ‘అడుగు’ దూరంలో మరోసారి నిరాశ తప్పదేమో!! అర్ధ భాగానికి ఇవే అంచనాలు! ఇంగ్లండ్ బ్యాటింగ్ ఛేజింగ్ మొదలై.. ఒక్కో ఓవర్ సాగుతుండగా అప్పుడు మొదలైంది అసలు మజా. ఏకపక్షం అనుకున్న మ్యాచ్.. ఏకబిగిన టెన్షనెత్తించింది! విక్టరీ రేసులో ముందున్నట్లుగా కనిపించిన ఇంగ్లండ్ తడబడింది. బౌలర్లు ఎంతటి వారైనా తమ బ్యాటింగ్‌తో దడదడలాడించే జాసన్ రాయ్, జో రూట్, మోర్గాన్ ఈసారి తుస్సుమన్నారు. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై కివీస్ ఆధిపత్యం మొదలైంది. ఇంగ్లండ్‌కు పిసరంత అనుకున్న లక్ష్యమే మ్యాచ్ సాగుతున్నకొద్దీ కొండంతై కూర్చుంది. బ్యాటింగ్‌లో తడబడిన న్యూజిలాండ్ బౌలింగ్‌లో మాత్రం తడాఖా చూపింది. అప్పటిదాకా ‘ఇదేం మ్యాచ్’ అని పెదవి విరిచినోళ్లే ‘ఇదే మ్యాచ్’ అన్న ఆసక్తితో టీవీలకు అతుక్కుపోయారు! 40వ ఓవర్ నుంచైతే ఎవరిది విజయం? ఎవరిది పరాజయం? అన్న ఉత్కంఠ మరింత పెరిగింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. 45వ ఓవర్ నుంచి ఈ హీట్ శిఖర స్థాయికి చేరింది! ఆఖరు 30 బంతుల్లో 46 పరుగులుగా ఉన్న ఇంగ్లండ్ టార్గెట్.. న్యూజిలాండ్ బౌలర్లు నీషమ్, బౌల్ట్ కట్టుదిట్టమైన బంతులతో ఆఖరు ఓవర్ వచ్చేసరికి ఆరు బంతుల్లో 15 పరుగులుగా మారింది!! అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు! విజయం ఇంగ్లండ్‌దా? న్యూజిలాండ్‌దా? 2019 వరల్డ్‌కప్ విజేత ఎవరు?
ఈ ఉత్కంఠను శిఖరాగ్రానికి చేరుస్తూ ఫైనల్ ఓవర్ మొదలైంది. ఇంగ్లండ్ అభిమానుల ఆశలన్నీ మోస్తూ 70 పరుగులతో మొండిగా పోరాడుతున్న బెన్ స్టోక్స్! కివీస్ అభిమానుల ఆశలన్నీ మీదేసుకొని బంతి చేతుల్లోకి తీసుకున్నాడు స్పీడ్ గన్ బౌల్ట్! తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఇంగ్లండ్ లక్ష్యం 4 బంతుల్లో 15 పరుగులు. ఫైనల్ అనే త్రాసు కివీస్ వైపు మొగ్గింది. మూడో బంతిని స్టోక్స్ లాగిపెట్టి సిక్స్ కొట్టాడు. ఇంగ్లండ్ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అప్పటికీ కివీ్‌సదే ఆధిపత్యం. నాలుగో బంతికి స్టోక్స్ 2 పరుగులు తీయడం.. ఫీల్డర్ గప్టిల్ వేసిన త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీ లైన్ దాటడంతో మొత్తంగా 6 పరుగులొచ్చాయి. ఫైనల్ మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. పక్కాగా ఇంగ్లండే గెలుస్తుందని అందరూ ఫిక్సయ్యారు కూడా! ఐదో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న రషీద్ రనౌట్ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌల్ట్ వేసిన ఫుల్ టాస్‌ను లాంగ్ ఆన్ దిశగా ఆడాడు స్టోక్స్. వెంటనే ఈ వైపు నుంచి స్టోక్స్.. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ నుంచి వూడ్ పరుగులు పెట్టారు. ఒక పరుగే పూర్తయింది. రెండో పరుగు పూర్తయ్యేంతలో వూడ్ రనౌట్ అయ్యాడు!! 241 పరుగులతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్ టై!!
No comments:
Post a Comment